తన సినిమాలో నటించిన మల్లయోధులను సన్మానించిన పవన్ కళ్యాణ్

తన సినిమాలో నటించే స్టంట్‌మెన్, ఫైటర్స్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటారు. ‘గబ్బర్ సింగ్’ విలన్ గ్యాంగ్‌‌‌ను ఆయన ఏ విధంగా సత్కరించారో గతంలో చూశాం. ఆ గ్యాంగ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా కొలుస్తారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన సినిమాలో నటించిన ఫైటర్స్‌పై తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రాచీన యుద్ధ కళలను చూపించబోతున్నారు. ఈ యుద్ధ కళలతో కూడిన ఒక ఫైట్ సీక్వెన్స్‌లో నటించడానికి ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర నుంచి 16 మంది మల్లయోధులను రప్పించారు. షూటింగ్ కూడా పూర్తి చేశారు. చిత్రీకరణ సమయంలో ఆ మల్లయోధుల ప్రతిభకు ముగ్ధులైన పవన్ కళ్యాణ్ వారందరినీ సత్కరించి పంపించారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి ఆ మల్లయోధులను తీసుకువెళ్లి వారిని సన్మానించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలకరించి శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు. తెలుగు మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గొప్పతనాన్ని వారికి వివరించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన ఆయన ప్రపంచ ప్రఖ్యాత యోధుడుగా ఎలా ఎదిగారు, దేశవిదేశాల్లో సాహస కృత్యాలు చేసే స్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియజేశారు. చివరగా మల్లయోధుల బృందానికి గధను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయ యుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని అన్నారు. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని హెచ్చరించారు. “ప్రాచీన యుద్ద విద్యలకు మన దేశం పేరెన్నికగన్నది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉంది. చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్నగారు కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండే పహిల్వాన్‌ అప్పారావు గారి లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడిని. నేర్చుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. కోడి రామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌‌లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్‌ బాక్సింగ్‌, కరాటే, ఇండోనేషియా మార్షల్‌ ఆర్ట్స్‌‌లో నైపుణ్యం పొందాను’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ