సినిమా టికెట్ ధర పెంచడం కరెక్ట్ కాదు.. కరోనా ప్రభావం ప్రేక్షకుడిపైనా ఉంది: ఆర్.నారాయణమూర్తి

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మధ్య కొన్ని వరాలు కురిపించిన విషయం తెలిసిందే. దీంట్లో ఓ వరం టికెట్ ధరల సవరణ. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించారు. దీని వల్ల సామాన్యుడిపై భారం పడుతుందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. టికెట్ ధరలు పెంచవద్దని సినీ నిర్మాతలను ఆయన విజ్ఞప్తి చేశారు. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డిసెంబర్ 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడానికి చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆర్.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి తనదైన శైలిలో మాట్లాడారు. ‘‘కరోనా సమయంలో మానవజాతి అల్లకల్లోలమైంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వలస కార్మికుల్లాగా సినీ కార్మికుల భవిష్యత్తు కూడా ఏంటి? అని అందరూ ఆలోచించుకుంటున్న దశలో.. థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు, సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ టీంను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్‌గారు, వైఎస్‌ జగన్‌ గారు థియేటర్స్‌ ఓపెన్‌ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించారు. ఇది చాలా ఆనందంగా ఉంది. అబ్దుల్ కలాం, వాజ్‌పేయి, మమతా బెనర్జీ, మదర్ థెరిస్సా వంటి మహామహుల మధ్య నా కటౌట్‌ పెట్టి దర్శకుడు సుబ్బు సినిమాను నడిపించాడు. అందులో నా అభిమానిగా నటించిన సాయి ధరమ్ తేజ్‌ గారికి థాంక్స్‌. సినిమా చాలా బావుందంటూ అనేక మంది ఫోన్‌ చేస్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటూ గొప్ప మెసేజ్‌ను ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు సుబ్బు చూపించారు. ఈ సినిమాలో నాకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చూసిన తర్వాత మన తెలుగులోనే కాదు.. ఎంటైర్‌ సినీ ఇండస్ట్రీకి తమ సినిమాను విడుదల చేసుకోగలమనే ధైర్యం వచ్చింది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలన్నింటికీ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో నేను ఇచ్చే సలహా ఒకటే. ఎవరూ టికెట్‌ ధర పెంచవద్దని నా మనవి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న మాట నిజమే. కానీ.. సినీ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుడు కూడా కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ఎంత పెద్ద బడ్జెట్‌ మూవీ అయినా టికెట్‌ రేటు పెంచవద్దని ఇండస్ట్రీని కోరుకుంటున్నాను. కోర్టులకు వెళ్లి టికెట్స్‌ రేట్స్‌ పెంచమని అడగడం కరెక్ట్‌ కాదు. ఇలా రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి సినిమా టికెట్‌ రేట్స్‌ పెంచకండి. సీఎం కేసీఆర్‌ గారు, వైఎస్‌ జగన్‌ గార్లను టికెట్‌ రేట్లు పెంచడానికి ఒప్పుకోవద్దని కోరుతున్నాను’’ అని నారాయణమూర్తి అన్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ