RRR రామరాజు వచ్చాడహో.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో

ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటాది.. కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టు ఉంటుంది. ఎదురు బడితే చావుకైనా చెమట దారబడతది.. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతా రామరాజు’ అంటూ ఎన్టీఆర్ డైలాగ్‌లో ప్రారంభమైన ఈవీడియోలో తేజ్.. అల్లూరిగా అదరగొట్టాడు. ఇలాంటి వీడియో కోసం గంటలు కాదు.. ఎన్ని రోజులు అయినా వేచి చూడొచ్చనేంతగా ఔట్ పుట్ ఇచ్చి దటీజ్ జక్కన్న అనిపించారు. అల్లూరిని చూడని వాళ్లకు అల్లూరి అంటే ఇలాగే ఉండేవారా అన్నంతగా అద్భుతంగా చూపించారు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడుకునేట్టు ఉన్నాయి. గురువారం రాత్రి 7.18 నిమిషాలౌతోంది.. ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ‘సోదర రామ్ చరణ్, మంచి పరిస్థితుల్లో నీ పుట్టినరోజును జరుపుకోవాలని నేను భావించాను. కానీ, ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఎందుకంటే, ఇంటిలో ఉండటమే ఇప్పుడు ముఖ్యం. రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’ అంటూ ట్వీట్ చేయడంతో ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ట్వీట్ పెట్టగానే ట్విట్టర్‌లో RRR మోత మొదలైంది. ఈ సీతారామరాజుకోసం.. ఆ కొమరం భీం ఏం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారనే ఆసక్తితో ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? అని ఎదురు చూసిన ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అయితే ముందుగా ప్రకటించినట్టుగా ఉదయం 10 గంటలకు టెక్నికల్ పరమైన కారణాలతో వీడియోను విడుదల చేయలేకపోయారు. దీంతో సాయంత్రం 4 గంటలకు వరకూ ఈ సర్ ప్రైజ్‌ను వాయిదా వేస్తూ ఎట్టకేలకు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ వీడియోలో రామ్ చరణ్ నిజంగానే సర్ ప్రైజ్ చేశాడు. జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్, చరణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి RRR (రౌద్రం రుధిరం రణం) అనే టైటిల్‌ని కన్ఫామ్ చేస్తూ ఉగాది కానుకగా మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ వెంటనే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో అనగానే మూవీ లవర్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. అయితే చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించిన శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయలేకపోవడంతో ట్విట్టర్‌లో రాజమౌళిపైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ రకరకల మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. మొత్తానికి ఈ ఉదయం నుండి ఆర్ ఆర్ ఆర్ టాప్ ట్రెండింగ్‌లోనే ఉంది. ఇక తాజా వీడియోలో రామరాజుగా రామ్ చరణ్ రౌద్రం ప్రదర్శించి వహ్ వా అనిపించారు. మొత్తానికి ప్రేక్షకుల్ని నిరాశ పరచకుండా కాస్త లేటైనా రామ రాజు వీడియోతో సర్ ప్రైజ్ గిఫ్ట్ అయితే అందించగలిగారు రాజమౌళి.
Comments
Post a Comment