‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ డేట్: జులైలో వస్తోన్న రాకీ భాయ్

‘తొందరపడితే చరిత్రను తిరగ రాయలేం.. ఊరికే చరిత్రను సృష్టించలేం’. ఇది నిజమని నమ్మించడానికి సిద్ధమవుతున్నాడు రాకీ భాయ్. ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 1’తో నరాచీలో మొదలైన రాకీ భాయ్ దండయాత్ర పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఈ దండయాత్రను కొనసాగించడానికి రాకీ భాయ్ మరోసారి సిద్ధమవుతున్నాడు. మరింతగా థ్రిల్‌కు గురిచేసే అంశాలతో జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 2’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ సహా ప్రకాశ్ రాజ్, రావు రమేష్ వంటి ప్రతిభావంతులైన నటులు నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ మూవీ చిత్రీకరణను పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాను జులై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 2’ విడుదలవుతోంది. తెలుగులో వారాహి చలన చిత్రం విడుదల చేస్తుంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు.
Comments
Post a Comment