ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఏపీ ప్రభుత్వ ఘన నివాళి.. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన చరణ్

గాన గంధర్వురు ప్రస్తుతం మన మధ్యలో లేకపోయినా.. ఎన్నటికీ మాసిపోని ఆయన స్వరం సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆయన పాడిన పాటలు వింటూ బాలసుబ్రమణ్యంను నిత్యం తలచుకుంటోంది సినీ లోకం. అయితే తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టి ఆయన కీర్తిని చాటిచెప్పే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఈ మేరకు గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ పెట్టారు. దీనిపై రియాక్ట్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తన తండ్రి పేరును నెల్లూరు ప్రభుత్వ నృత్య పాఠశాలకు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మరణం తర్వాత తన తండ్రికి ఇచ్చిన గౌరవం పట్ల సీఎం జగన్‌కి, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. బాలసుబ్రమణ్యం అభిమానులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరస్మరణీయుడైన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నెల్లూరు లోనే పుట్టి పెరిగిన ఆయనకు ఆ ప్రాంతమంటే ఎంతో ఇష్టం. బాలు బ్రతికుండగానే.. తన తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ జ్ఞాపకార్థం నెల్లూరులోని తన సొంత ఇంటిని వేద పాఠశాల కోసం త్యాగం చేశారు.
Comments
Post a Comment