Actress Sai Sudha: నటి సాయి సుధకు పెళ్లి పేరుతో మోసం.. శ్యామ్ కె నాయుడు అరెస్ట్

నటి సాయి సుధతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించి మోసం చేసిన కేసులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. చోటా కె నాయుడు తమ్ముడు తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తనతో సహజీవనం చేసి శారీరకంగా దగ్గరయ్యారని, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంలేదని నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదును స్వీకరించిన తరవాత శ్యామ్ కె నాయుడుని ప్రశ్నించిన పోలీసులు.. విచారణ చేపట్టారు. వీరి విచారణలో శ్యామ్ కె నాయుడు.. సాయి సుధతో ఆరు నెలలు సహజీవనం చేశారని.. ఇటీవల వీరి మధ్య దూరం పెరగడంతో ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచి వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. శ్యామ్ కె నాయుడుపై ఐపీసీ సెక్షన్ 493 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు. ఇక సాయి సుధ విషయానికి వస్తే.. గుంటూరుకు చెందిన ఈమె ఫిజియోథెరపీ డాక్టర్. కొన్నాళ్ల పాటు డాక్టర్‌గా పనిచేసిన సాయి సుధ సినిమాలపై ఉన్న ఆసక్తితో డాక్టర్ ఉద్యోగం వదిలేసి యాక్టర్‌గా ట్రై చేశారు. బాడీగార్డ్, దమ్ము, అవును, అర్జున్ రెడ్డి, ఎవరు తదితర చిత్రాల్లో నటించారు సాయి సుధ. గత ఆరు నెలలుగా శ్యాం కె నాయుడుతో రిలేషన్‌లో ఉన్న సాయి సుధ.. పలుమార్లు ఆయనతో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినా లాభం లేకుండా పోయిందని.. శ్యాం కె నాయుడు అన్నయ్య చోటా కే నాయుడు తమకు పెళ్లి చేయిస్తానని మాట ఇచ్చారని ఇప్పుడు ఎవరూ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకి వివరించారు. అయితే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ కేసులో కూడా శ్యామ్ కే నాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. పూరీకి డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడే అంటూ అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.
Comments
Post a Comment