థాంక్యూ చిరంజీవి గారు.. అంతా బాగున్నారని ఆశిస్తున్నా: సచిన్

మెగాస్టార్ సోషల్ మీడియాలో ఆలస్యంగా జాయిన్ అయినా ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని, అలాగే సోషల్ మెసేజ్‌ను అందిస్తున్నారు. చిరంజీవి ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆయన ప్రతి ట్వీట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇతరులకు తనకు తేడా చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 24న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 48వ ఏట అడుగుపెట్టారు. సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. సచిన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘‘క్రికెట్ దేవుడు, భారత గౌరవం, వన్ అండ్ ఓన్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. భారత తరాలకు మీరు ఇలానే స్ఫూర్తిని ఇస్తూ ఉండాలి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలి’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, చిరంజీవి ట్వీట్‌కు సోమవారం (ఏప్రిల్ 27న) రిప్లై ఇచ్చారు. ‘‘ఇంత గొప్పగా చెప్పినందుకు కృతఙ్ఞలు చిరంజీవి గారు. మీ వాళ్లంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను’’ అని సచిన్ తన ట్విట్టర్ రిప్లైలో పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కు సచిన్ రిప్లై ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సచిన్ టెండూల్కర్‌తో చిరంజీవికి ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. అయితే, ఇండియన్ సూపర్ లీగ్ వల్ల వీళ్ల మధ్య బంధం మరింత బలపడింది. ఈ లీగ్‌లో పాల్గొన్న కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు సచిన్ సహ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లు యజమానులుగా ఉండేవారు. అయితే, రెండేళ్ల క్రితం తన 20 శాతం వాటాను చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు సచిన్ విక్రయించారు. నష్టాలు రావడంతోనే సచిన్ తన వాటాను అమ్మేశారు.
Comments
Post a Comment