చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ.. భారీగా విరాళాలు

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ సీసీసీ మనకోసంకు సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు.. దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్ వెల్లడించారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘మన సోదర కార్మికులకి మనం ఏం చేయగలం అని చిరంజీవి తన ఆలోచనతో ముందుకు వచ్చారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు, నేను, ఎన్.శంకర్, కల్యాణ్, దాము అందరం కలిసి చిన్న కమిటీగా ఏర్పాటయ్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. దీనికి నాందిగా మొదట చిరంజీవి కోటి రూపాయలను ప్రకటించారు. నాగార్జున కోటి రూపాయలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు ఇలా విరాళాలు ప్రకటించారు. వీరే కాకుండా ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవచ్చు’’ అని చెప్పారు. Also Read: అనంతరం డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ‘‘సీసీసీ మనకోసం సంస్థకి చైర్మన్‌గా మెగాస్టార్ చిరంజీవి ఉంటారు. అలాగే సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కల్యాణ్, దాము, బెనర్జీ, నేను ఉంటాం. సీసీసీ మనకోసం కమిటీతో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్, గీతా ఆర్ట్స్ బాబు, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, కొమరం వెంకటేష్, ఫెడరేషన్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులు కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు’’ అని వెల్లడించారు. కాగా, ఈ ఛారిటీకి రామ్ చరణ్ కూడా రూ.30 లక్షలు ప్రకటించారు. ఆయన ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment