విజయ నిర్మల ఇంట్లో వైఎస్ ఫోటోలు చూసి భావోద్వేగానికి గురైన జగన్!
విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఎం నానక్‌రూమ్ గూడలోని ఆమె నివాసానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంట్లోని ఓ చోట వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని జగన్‌కు విజయ నిర్మల కుమారుడు నరేశ్ చూపించారు. ఆమెకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని నరేశ్ వివరించారు. ఇంట్లోని ఓ టేబుల్ పై ఆ ఫోటోలకు పూలమాలలు వేసి ఉన్నారు. ఈ ఫోటోలనూ చూస్తూ ఒకింత భావోద్వేగానికి గురైన జగన్, నరేశ్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా సినీ రంగానికి విజయ నిర్మల చేసిన సేవలను జగన్ కొనియాడారు. ఇదిలా ఉండగా కృష్ణ, వైఎస్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్‌తో చాలా దగ్గరగా ఉండేవారు. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. అయితే, తన విజయం వెనుక వైఎస్ కూడా ఉన్నారనే అప్పట్లో కృష్ణ చెప్పేవారు. తదనంతర పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నా, వైఎస్ కుటుంబంతో కృష్ణ సాన్నిహిత్యంగానే ఉంటూ వచ్చారు. ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు తొలుత వైసీపీలోనే ఉన్నారు. ఏపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన టీడీపీలో చేరారు. సోదరి గల్లా అరుణకుమారి సైతం వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆమె చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి మంత్రిగా ఉన్నారు.
Comments
Post a Comment