విజయనిర్మల కల.. కలగానే మిగిలిపోయింది

సినిమా ప్రపంచంలోనే ఏ మహిళకు దక్కని రికార్డును సొంతం చేసుకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించిన ఆమె తెలుగు సినిమా పరిశ్రమకే మకుటంగా నిలిచారు. అయితే సినీ రంగంలో ఎన్నో ఘనతలు సాధించిన విజయనిర్మల తన కలను నెరవేర్చుకోకుండానే దివికేగడం విషాదకరం. ఇంతకీ ఆమె కల ఏమిటో తెలుసా?. 50 చిత్రాలకు దర్శకత్వం వహించడం. 44 సినిమాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మల ఎప్పటికైనా హాఫ్ సెంచరీ కొట్టాలని అనుకునేవారట. దాని కోసం ఎంతో తపించిన ఆమె కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. ‘2009లో వచ్చిన నేరము-శిక్ష’ ఆమె 44వ సినిమా. ఆ తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్లు కొద్దికాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో దాదాపు నాలుగేళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె 2013లో మరో సినిమా చేసేందుకు కసరత్తులు చేసేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేశ్‌బాబు మల్టీస్టారర్ కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆమెకు తెగ నచ్చేసింది. ఈ సినిమా స్ఫూర్తితోనే ఓ కుటుంబ కథా చిత్రం చేయాలని అనుకున్నారట. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆమె 50 చిత్రాల టార్గెట్ కలగానే మిగిలిపోయింది. ఇప్పటికే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్‌బుక్ రికార్డు విజయనిర్మల పేరు మీదే ఉంది. అయితే ఆమె చివర కోరిక నెరవేరకపోవడం మాత్రం అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది.
Comments
Post a Comment