విజయ నిర్మల భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు, కృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చిన సీఎం

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ భార్య, నటి, దర్శకురాలు భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. విజయ నిర్మల పార్థివదేహానికి అంజలి ఘటించారు. భార్య మరణంతో విషాదంలో కూరుకుపోయిన సూపర్ స్టార్ కృష్ణను సీఎం ఓదార్చారు. నరేష్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. కేసీఆర్ వెంట మంత్రులు తలసాని, ఎర్రబెల్లి , శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు. ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌లోని ప్రముఖులంతా ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు విజయ నిర్మల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళగా ఆమె 2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించారు.
Comments
Post a Comment