అంతటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో చూడలేం: చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు మృతి పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని ఆయన అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. విజయనిర్మల లేని లోటు యావత్తు సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ‘అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్‌కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు, విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు.
Comments
Post a Comment